CURRENT AFFAIRS ON 09-09-2016

1.హైదరాబాద్‌లో జర్మనీ కంపెనీ

జర్మనీ కి చెందిన ప్రఖ్యాత వాహన ఉపకరణాల తయారీసంస్థ జెడ్ఎఫ్ ఫ్రెడ్రిక్‌షాఫెన్‌ హైదరాబాద్ లో తమ ఇండియా టెక్నికల్ సెంటర్ ను ఏర్పాటు చేసుకుందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తో ఒప్పందం కుదుర్చుకుంది.  ఎలక్ట్రానిక్స్‌ఎంబెడెడ్‌ సాఫ్ట్‌వేర్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించి జేఎఫ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్పత్తి అభివృద్ధి బృందాలకు మద్దతుగా నిలుస్తుంది. భారత్‌లో జేఎఫ్‌కు ఇదే తొలి టెక్నాలజీ కేంద్రం.భారత్‌లో నైపుణ్యం, తెలివితేటలు కలిగిన నిపుణులు భారీగా ఉన్నారని, ఈ నైపుణ్యాలను వినియోగించుకుని వినియోగదారుల అవసరాలు, గిరాకీకి అనుగుణంగా అడ్వాన్స్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌, ఎలక్ట్రానిక్స్‌ను ఈ కేంద్రంలో రూపొందిస్తారని ఐటీసీ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌, ఎగ్జిక్యూటివ్‌ లీడ్‌ చామర్తి మమత తెలిపారు. కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ఐటీ మంత్రి కె.టి.రామారావు సమక్షంలో జేఎఫ్‌, తెలంగాణ ప్రభుత్వం ఆమోద పత్రాలపై సంతకాలు చేశాయి. 

2. దేశంలో తొలిసారి రోబో సేవలకు ఐసీఐసీఐ శ్రీకారం

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాదారులకు ఇకపై రోబోలు కూడా సేవలు అందించనున్నాయి.ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ చందాకొచ్చర్ ముంబై లో రోబోటిక్స్ పవర్ బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారభించారు. రోబోటిక్స్ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్న తోలి దేశీయ బ్యాంకు తమదే అని అన్నారు. బ్యాంక్‌ అందిస్తున్న మొత్తం సేవల్లో 10 శాతం కార్యకలాపాలను రోబోలే నిర్వహిస్తాయి. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఇవి చేసే పనుల సంఖ్యను 500 (20 శాతం)కు పెంచనున్నారు. సమాచారం అందించడం, సూచనలు పాటించడం, సమాచారాన్ని నిక్షిప్తం చేయడం, పత్రాల పరశీలన, సమాచారాన్ని శోధించడం, కరెన్సీ ఎక్స్ఛేంజీ వంటి సేవలను రోబోలు అందించనున్నాయి.


3. ‘జీఎస్‌టీ’కి రాష్ట్రపతి ఆమోదముద్ర

 వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడటంతో జీఎస్‌టీ మండలి ఏర్పాటుకు మార్గం సుగమమయింది. పన్ను రేటు, సెస్‌, సర్‌ఛార్జీలు వంటి వాటిని ఈ మండలి నిర్ణయిస్తుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర లభించడంతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలో రాష్ట్రాల ఆర్థికమంత్రులతో జీఎస్‌టీ మండలి ఏర్పాటవుతుందని వెల్లడించారు. 

4.గ్రామీణ పారిశుద్ధ్యం సర్వే 

గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులపై జాతీయ శాంపిల్‌ సర్వే నిర్వహించిన సర్వేలో స్వచ్ఛ రాష్ట్రంగా సిక్కిం మొదటి స్థానంలో నిలిచింది. 2015 మే-జూన్‌ మధ్య 26 రాష్ట్రాల్లోని 3,788 గ్రామాల్లో 73,716 నివాసాల్లో ఈ సర్వే నిర్వహించారు. మరుగుదొడ్లను కలిగి ఉన్న ఇండ్ల శాతం, వాటి వినియోగం ఆధారంగా ఈ ర్యాంకులను ఖరారు చేశారు. ఈ సర్వే నివేదికను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ గురువారం దిల్లీలో విడుదల చేశారు. ఈ నివేదికలో 98.2 శాతంతో సిక్కిం మొదటిస్థానంలో నిలవగా, చివరి స్థానంలో ఝార్ఖండ్‌ నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌ 14వ స్థానంలో నిలువగా, ఆంధ్రప్రదేశ్‌ 16వ స్థానంలో నిలిచింది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లల్లో మరుగుదొడ్లు కలిగి, వాటిని వాడుతున్న వారి శాతం 42.13గా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తన నివేదికలో పేర్కొంది.


 5.వినువీధిలో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌05 

అంతరిక్షరంగంలో తనకు తిరుగు లేదు అని ఇస్రో మరోసారి యావత్ ప్రపంచానికి చాటిచెప్పింది. భారత అంతరిక్ష విజయాల ఖాతాలో మరో దిగ్విజయ ప్రయోగం చోటుచేసుకుంది. మరోసారి భారత్‌ ప్రపంచ దేశాల సరసన సగర్వంగా నిలబడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గురువారం అత్యాధునిక ఇన్సాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాన్ని జియోసింక్రనస్‌ ఉపగ్రహ వాహక నౌక-జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌05 ద్వారా అంతరిక్షానికి విజయవంతంగా పంపించింది. ఆ తర్వాత ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో పెట్టి శాస్త్రవేత్తలు తమ సత్తాను చాటిచెప్పారు. ఈ ఘటనను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌) వేదికైంది. 20 సంవత్సరాల కు పైగా ఒక కల లాగా ఊరిస్తూ వచ్చిన క్రయోజెనిక్ ఇంజిన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో సొంతగా అభివృద్ధిపరిచింది. జీఎస్‌ఎల్‌వీ వాహకనౌకకు పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ఉపయోగించారు. స్వదేశీ క్రయోజనిక్‌ ఇంజిన్‌తో జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలను ఇప్పటిదాకా అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, జపాన్‌, చైనా, భారత్‌ మాత్రమే చేపట్టాయి. జీఎస్‌ఎల్‌వీ వాహకనౌకలో మూడు దశలు ఉన్నాయి. మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించారు. కీలకమైన మూడో దశలో ద్రవీకృత హైడ్రోజన్‌, ఆక్సిజన్‌లను మండించేందుకు దేశీయ క్రయోజనిక్‌ ఇంజిన్‌ వినియోగించారు.

6. సెరెనాకు నిరాశ

 యూఎస్‌ ఓపెన్‌తో 23వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించి రికార్డు సాధించాలనుకున్న సెరెనా విలియమ్స్‌కు నిరాశే ఎదురైంది.తొలిసారిగా గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్‌కు వచ్చిన యువ సంచలనం కరోలినా ప్లిస్కోవా ముందు ఈ దిగ్గజ క్రీడాకారిణి అనుభవం పనిచేయలేదు. దీంతో సెమీస్‌లో వరుస సెట్లతో సెరెనా పరాజయంపాలైంది.తొలిసెట్లోనే ప్రత్యర్థి పోరును తట్టుకోలేక వెనుకబడిపోయిన సెరెనా.. రెండో సెట్లో మాత్రం ప్లిస్కోవాపై ఎదురుదాడికి దిగింది. అయితే హోరాహోరీగా సాగిన రెండో సెట్లో ప్లిస్కోవా ఆచితూచి వ్యవహరించింది. దీంతో సెరెనాకు ఓటమి తప్పలేదు. 2-6, 6-7 వరుస సెట్లతో సెరెనా ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. నంబర్‌ వన్‌పై గెలిచిన ప్లిస్కోవా తొలిసారిగా గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ పోరుకు చేరుకుంది.ఈ ఏడాదిలో ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ సాధించిన కెర్బర్‌.. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు రావడం ఇదే తొలిసారి. కాగా.. స్టెఫీగ్రాఫ్‌ తర్వాత యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరుకున్న తొలి జర్మన్‌ మహిళ కూడా కెర్బర్‌ కావడం విశేషం.

7.  రూ.19 కోట్ల భారతీయ చిత్ర పటం

వేలంలో భారతీయ చిత్రకారుడు అక్బర్‌ పదమ్‌సీ ప్రపంచ రికార్డు సృష్టించారు..భారతీయ చిత్రకారుడు అక్బర్‌ పదమ్‌సీ చిత్రించిన ‘గ్రీక్‌ లాండ్‌స్కేప్‌’ అనే అద్భుత చిత్రరాజం సాఫ్రాన్‌ ఆర్ట్స్‌ వేలంలో ప్రపంచ రికార్డు ధర పలికింది. నలుపు, తెలుపు రంగుల్లోని ఈ పెయింటింగ్‌ను ఓ వ్యక్తి రూ.19.19 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. వేలంలో ఓ చిత్రకారుడి కుంచెనుంచి జాలువారిన చిత్రానికి అత్యధిక ధర పలకడం ఇదే తొలిసారి.అంతకు ముందు ప్రపంచ రికార్డైన ‘రిక్లైనింగ్‌ న్యూడ్‌’ (1960) రూ.9.3 కోట్లను ఇది తిరగరాసిందని వేలం నిర్వాహకులు తెలిపారు.
  

 8. రక్తాన్ని తలపించే నది

  రష్యాలోని నోరిల్స్క్‌ పట్టణం కాలుష్యంతో నిండిన వాటిలో మొదటి స్థానంలో ఉన్న సిటీ. ఆర్కిటిక్‌ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఆ పట్టణంలో ‘డాల్డికన్‌’ అనే నది ఉంది. ఇది ఆ ప్రాంత ప్రజలకు నీటి అవసరాలను తీర్చేది. అయితే నదికి దగ్గర్లోనే వివిధ రసాయన పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. వాటి నుంచి వెలువడే వ్యర్థాల వల్ల నది అంతా కాలుష్యంతో నిండిపోయింది. దాని కారణంగా నదిలోని నీరు మొత్తం ఎర్రటి రంగులోకి మారిపోయాయి. ప్రజల దాహార్తిని తీర్చే ఆ నది ఇప్పుడు హానికర వ్యర్థాలతో నిండి, నెత్తురే ఏరులై ప్రవహిస్తోంది.

9. టెలికాం సంస్థలతో ట్రాయ్‌ భేటీ

రిలయన్స్‌ జియో, ఇతర టెలికాం సంస్థల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు శుక్రవారం ట్రాయ్‌ (భారతీయ టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ) సమావేశం నిర్వహించింది. అయితే ఈ సమావేశానికి సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(కాయ్‌) నుంచి ఎవరినీ అనుమతించలేదు. సమావేశంలో పాల్గొనేందుకు ఒక్కరికీ కూడా అవకాశం కల్పించలేదు.ఈ సమావేశానికి జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

10.ఒబామా పేరుతో పరాన్నజీవి

అమెరికా శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న ఓ పరాన్నజీవిని ఒబామా పేరుతో పిలుచుకుంటున్నట్లు వెల్లడించారు. పారాసైటాలజీ పత్రికలో పేర్కొన్న కథనం ప్రకారం ఈ పరాన్నజీవికి ‘బరాక్‌ట్రెమా ఒబామై’ అనే శాస్రీయ నామం పెట్టారు.తన కెరీర్‌లో ఆయన 32 కొత్త ప్రాణులను కనిపెట్టారు. గతంలో తన మామగారి పేరు, పీహెచ్‌డీ గైడ్‌ పేరు.. ఇలా పెట్టుకొచ్చిన ప్లాట్‌ తాజాగా కనుగొన్న పరాన్నజీవికి మాత్రం ఒబామా పేరే సరైందని నిర్ణయించుకున్నారు. దేశాధ్యక్షుడైన ఒబామా దీన్ని గౌరవంగా భావించాలన్నారు.





Previous
Next Post »