CURRENT AFFAIRS ON 07-09-2016

1.‘మిస్‌ జపాన్‌’ గా భారత సంతతి యువతి

భారత మూలాలున్న జపాన్‌ అందాల సుందరి ప్రియాంక యోషికవా (22) ‘మిస్‌ జపాన్‌’ కిరీటాన్ని గెలుచుకున్నారు. తాను ఎన్నోసార్లు జాతి సంబంధమైన సమస్యలను ఎదుర్కొన్నట్లు ఆమె తన విజయానంతరం మాట్లాడుతూ.. ఉద్వేగంగా చెప్పారు. భారతీయుడైన తండ్రి, జపాన్‌ దేశస్థురాలైన తల్లి అందచందాలన్నీ పుణికి పుచ్చుకున్న పొడగరి (5 అడుగుల8 అంగుళాలు).  టోక్యోలోనే పుట్టిన ప్రియాంక కొన్నేళ్లపాటు శాక్రమెంటో, ఓ ఏడాది పాటు భారత్‌లో ఉండి...పదేళ్ల వయసులో జపాన్‌కు తిరిగి వచ్చారు.

2.ఇప్పటినుండి  ఏటీఎంల ద్వారా ఆధార్‌ అనుసంధానం

నగదు లావాదేవీలకు ఆధార్‌ను ప్రాతిపదికగా చేసేందుకు కేంద్రం గట్టిగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఏటీఎంల నుండి కూడా ఆధార్ నంబర్ ను అనుసంధానం చేసుకునే అవకాశని కల్పిస్తున్నారు. ఆధార్‌ సంఖ్యను బ్యాంకు ఖాతాలతో అనుసంధానించుకోవాలని ఏటీఎంల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు తమ ఖాతాదారులను కోరనున్నాయి. ఆధార్‌ను బ్యాంకు ఖాతాలతో సులువుగా అనుసంధానించుకునేందుకు ఏటీఎం మెనూల్లో స్వయం సహాయక ఆప్షన్‌ను ఏర్పాటు చేయాలని అన్ని బ్యాంకులకూ సూచించినట్లు సమాచారం .

3.  ఒబామాకు అవమానం

అమెరికా అధ్యక్షుడు ఒబామాకు మళ్లీ అవమానం ఎదురయింది.మొన్న చైనాలో ఆయన విమానం దిగడానికి నిచ్చెన కూడా ఏర్పాటు చేయకుండా ఆ దేశం అవమానిస్తే తాజాగా ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టీ ఆయన్ని ఏకంగా అనరాని మాటలు అనేశారు. ‘ఆయన (ఒబామా) తనను తాను ఏమనుకుంటున్నారు? నేనేమీ అమెరికా తోలుబొమ్మను కాను. నేనొక సార్వభౌమాధికార దేశానికి అధ్యక్షుడిని. ఫిలిప్పీన్స్‌ ప్రజలకు తప్ప నేనెవరికీ జవాబుదారీ కాను...’ అంటూ సోమవారం తెగేసి చెప్పడమే కాకుండా ఒబామాను ఓ తిట్టుతో దూషించారు. దీంతో ఒళ్లుమండిన ఒబామా... మంగళవారం రోడ్రిగోతో జరగాల్సిన భేటీని రద్దు చేసుకున్నారు.

4.నేటినుండే  పారా ఒలింపిక్స్‌ మొదలు

రియో డిజనీరోలోని మారకానా స్టేడియంలో పారా ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.వికలాంగులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న రియో 2016 పారా ఒలింపిక్స్‌ పోటీలను ఈ సారి ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 154 దేశాల్లో ప్రసారం చేస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ పారాలింపిక్‌ కమిటీ వెల్లడించింది. టీవీ, రేడియో, ఆన్‌లైన్‌ ద్వారా పోటీలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చని కమిటీ సిబ్బంది తెలిపారు. పారాలింపిక్స్‌ ఈ నెల 7 నుంచి 18 వరకు జరగనున్నాయి. మన దేశం తరఫున 15మంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

5.ధోనీపై కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు

భారత కెప్టెన్‌ ధోనీకి వూరట లభించింది. ధోని.. విష్ణుమూర్తి రూపంలో బూటు సహా వివిధ వస్తువులు పట్టుకున్నట్లుగా చూపిస్తూ ఓ మ్యాగజైన్‌ 2013లో ముఖచిత్రాన్ని ప్రచురించింది.
ఓ మ్యాగజైన్‌ ముఖపత్రంపై తనను తాను దేవుడిగా చూపించుకోవడం ద్వారా మతవిశ్వాసాలను గాయపరిచాడంటూ అతడిపై దాఖలైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది.

6.ఫెదరర్‌ రికార్డును బద్దలు కొట్టింది ఎవరు ?

యుఎస్‌ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్‌ (అమెరికా) అదరగొడుతోంది. తనదైన శైలిలో విరుచుకుపడ్డ ఆమె నాలుగో రౌండ్లో 6-2, 6-3తో కేవలం 68 నిమిషాల్లో యరోస్లావా ష్వెదోవా (రష్యా)ను మట్టికరిపించింది.  గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో 34 ఏళ్ల సెరెనాకు ఇది 308వ విజయం. దీంతో ఓపెన్‌ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌లు గెలిచిన ప్లేయర్‌గా రోజర్‌ ఫెదరర్‌ (307) రికార్డును బద్దలు కొట్టింది.సెరెనా తన తొలి గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ను 16 ఏళ్ల వయసులో, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (1998)లో గెలిచింది.మొత్తం మీద ఆమె యుఎస్‌ ఓపెన్‌లో 88, వింబుల్డన్‌లో 86, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో 74, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 60 మ్యాచ్‌లు గెలిచింది. ప్రస్తుత టోర్నీలో టాప్‌ సీడ్‌ సెరెనా ఇప్పటివరకు సర్వీసు కోల్పోలేదు. 

7. పద్మభూషణ్‌కు సుశీల్‌ పేరు సిఫారసు

రెండు సార్లు ఒలింపిక్‌ విజేత అయిన రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌ పేరును పద్మభూషణ్‌ అవార్డుకు రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) సిఫారసు చేసింది. సుశీల్‌తోపాటు మహిళా రెజ్లర్‌ అల్కా తోమర్‌, సుశీల్‌కోచ్‌, దోణాచార్య అవార్డు గ్రహీత యశ్‌వీర్‌సింగ్‌ పేర్లను కూడా ఈ అవార్డుకు సిఫారసు చేసినట్లు డబ్ల్యూఎఫ్‌ఐ పేర్కొంది. గత నెలలో ఈ ముగ్గురి పేర్లను పద్మ అవార్డులకు సిఫారసు చేసినట్లు డబ్ల్యూఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌ తెలిపారు. సుశీల్‌కుమార్‌ పేరును రెండేళ్ల క్రితమే ఈ అవార్డుకు సిఫారసు చేయగా తిరస్కరణకు గురైంది.

రెండు వ్యక్తిగత ఒలింపిక్‌ పతకాలు సాధించిన ఏకైక భారత అథ్లెట్‌ సుశీల్‌కుమారే. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గగా, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించాడు. రియో ఒలింపిక్స్‌లో 74 కేజీల ప్రిస్టైల్‌ విభాగంలో నర్సింగ్‌ యాదవ్‌ను పంపడంతో సుశీల్‌కుమార్‌ ఆ అవకాశాన్ని కోల్పోయాడు. డోపింగ్‌ కారణంగా నర్సింగ్‌ కూడా రియోలో పోటీపడని సంగతి తెలిసిందే.


Previous
Next Post »